ముందస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
‘అరైవ్ అలైవ్’ ప్రచారంలో కమిషనర్ సునీల్ దత్ సందేశం
విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
పొగమంచు, చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తల సూచనలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. ప్రమాదాల్లో గాయపడిన బాధితులు తమ అనుభవాలను పంచుకోవడంతో కార్యక్రమం భావోద్వేగభరితంగా మారింది. కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించగలమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటుబెల్ట్ పెట్టుకోకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్‌ఫోన్ వినియోగం, సిగ్నల్ జంప్, ఓవర్‌లోడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను విడిచిపెట్టాలని సూచించారు. తెలంగాణను రోడ్డు భద్రతలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమన్నారు.
పొగమంచులో డ్రైవింగ్‌కు కీలక సూచనలు
చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా దృష్టి మందగిస్తుందని పేర్కొంటూ, డ్రైవర్లు ముందుగానే ప్రయాణం ప్రారంభించాలి, అతివేగం, ఓవర్‌టేకింగ్ నివారించాలి, లో-బీమ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలి, సురక్షిత దూరం పాటించాలన్నారు. నిర్దేశిత లేన్లలోనే నడపడం, కిటికీ అద్దాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇండికేటర్లను ముందుగా వినియోగించడం, సడన్ బ్రేకింగ్ నివారించడం అత్యవసరమని తెలిపారు. పొగమంచు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే సురక్షిత ప్రదేశంలో వాహనం ఆపి పరిస్థితి స్పష్టమైన తర్వాత ప్రయాణం కొనసాగించాలని సూచించారు. తెలంగాణ పోలీసు శాఖ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీటీవో జగదీశ్, ఏసీపీలు తిరుపతి రెడ్డి, రమణమూర్తి, శ్రీనివాసులు, కళాశాల చైర్మన్ నవీన్, సీఐలు మురళి, రాజు, సంజీవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


