గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు
ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి
సర్పంచులకు అడిషనల్ కమిషనర్ మధులత దిశానిర్దేశం
డీపీఆర్‌సీలో ముగిసిన శిక్షణా తరగతులు
కాకతీయ, కారేపల్లి: గ్రామ పంచాయతీలే అభివృద్ధికి పట్టుకొమ్మలని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పంచాయతీలుగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ మధులత పిలుపునిచ్చారు. నగరంలోని డీపీఆర్‌సీ సెంటర్‌లో సింగరేణి మండలానికి చెందిన 41 గ్రామ పంచాయతీల సర్పంచులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచులకు ఆమె స్వయంగా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచులతో ముఖాముఖి మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణపై సర్పంచులు స్వయంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అన్నది నిరంతరం పరిశీలించాలని చెప్పారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జవాబుదారీతనంతో పారదర్శక పాలన అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భజ్య తండా సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు, భాగ్యనగర్ సర్పంచ్ భానోత్ హీరాలాల్, కొత్త తండాకు చెందిన ధారావత్ మంగీలాల్, అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్, గాదేపాడు సర్పంచ్ భూక్య రంజిత్ కుమార్, సూర్య తండా సర్పంచ్ రాందాస్ నాయక్, గోవింద్ తండా సర్పంచ్ నునావత్ కిరణ్ నాయక్, దుబ్బ తండా సర్పంచ్ ఆంగోత్ మతృ, పాత కమలాపురం సర్పంచ్ తేజావత్ బాబురావు, గిద్దవారిగూడెం సర్పంచ్ వెంకటేశ్వర్లు, చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావుసింగ్, పోలంపల్లి సర్పంచ్ దారావత్ హేమలత బాలాజీతో పాటు ఇస్లావత్ రాజు, భూక్య బాలు తదితరులు శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ ద్వారా గ్రామాల పాలనపై పూర్తి అవగాహన లభించిందని, కమిషనర్ సూచనల మేరకు మండల అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచులు ధీమా వ్యక్తం చేశారు.


