కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి నాలుగు నెలల (ఏప్రిల్-జూలై) ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి ఏ జి ) కు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఈ కాలంలో రాష్ట్రం సాధించిన ఆదాయం బడ్జెట్ అంచనాల కంటే చాలా తక్కువగా ఉండగా, అప్పులు మాత్రం గణనీయంగా పెరిగినట్లు నివేదికలో స్పష్టమైంది. ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రాబడి అంచనాలను భారీగా ఉంచినా, ఆ అంచనాల్లో కేవలం 21 శాతం మాత్రమే నాలుగు నెలల్లో రాబట్టగలిగింది. అంటే వాస్తవ ఆదాయం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పన్ను రాబడులు, జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా అంచనాలకు తగ్గట్టుగా లేవని సూచనలున్నాయి.
అప్పుల భారమే ఎక్కువ:
ఇక రాష్ట్ర అప్పుల విషయంలో అయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సంవత్సరం మొత్తం కోసం ప్రభుత్వం ఉంచుకున్న అప్పు అంచనాల్లో ఇప్పటికే 45 శాతం మించిపోయింది. అంటే నాలుగు నెలల్లోనే దాదాపు సగం అప్పులు తీసుకున్నట్టే. మిగతా ఎనిమిది నెలల్లో కూడా ఇదే విధంగా అప్పులు కొనసాగితే బడ్జెట్ అంచనాలను మించి భారీ అప్పు భారం రాష్ట్రంపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబడి తగ్గి, అప్పులు పెరగడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల ఖర్చులు, ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం మరింతగా అప్పులపై ఆధారపడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముందున్న సవాళ్లు:
ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన ఎనిమిది నెలల్లో భారీ ఆదాయం రాబట్టడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పు పరిమితులను అధిగమిస్తే ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న ఆదాయం అనే క్లిష్ట సమీకరణంలో నడుస్తోంది. ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచే చర్యలు తీసుకోవడం అత్యవసరమని నిపుణుల అభిప్రాయం.


