వెలుగుమట్ల నిర్వాసితులకు బీజేపీ అండ
అంబేద్కర్ భవన్‌లో బాధితులకు అన్నదానం
న్యాయం జరిగే వరకు తోడుంటాం :
దేవకీ వాసుదేవరావు, నెల్లూరి కోటేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ బోర్డు స్థలంలో నివసిస్తున్న నిరుపేదల గుడిసెలను తొలగించడంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రస్తుతం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న బాధితులను భారతీయ జనతా పార్టీ నాయకులు పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అంబేద్కర్ భవన్‌కు చేరుకుని బాధితులకు అన్నదానం నిర్వహించారు. స్వయంగా భోజనం వడ్డించి, తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరాశ్రయులైన కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో ఆదుకున్నందుకు బాధితులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


