త్రిశక్తి ఆలయంలో వైభవంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
– ప్రత్యేక పూజలు నిర్వహించిన గజ్వేల్ సిఐ రవికుమార్
– శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సూచన
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని త్రిశక్తి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రోజు ఉత్సవాల్లో గజ్వేల్ సిఐ రవికుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ… త్రిశక్తి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. బోనాల సమర్పణ, పలారం బండి ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, త్రిశక్తి ఆలయ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


