రేపటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ (సంతాన సీతారామ) దేవస్థానంలో ఈనెల 26 నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ నిర్మాణ కర్త, పురావస్తు శాఖ సహాయ అధికారి ఇంటూరి శేఖర్ రావు తెలిపారు. బుధవారం కూసుమంచి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వాసనామ సంవత్సరం, ఫాల్గుణ మాసం దశమి నుంచి ఏకాదశి పునర్వసు నక్షత్రం వరకు రెండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అర్చకులు రఘునాథాచార్యులు, ముడుంబ శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ కోరింది.


