భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేత…
వెలుగుమట్లలో 60 ఎకరాల భూమిపై ఉద్రిక్తత
600 పేద కుటుంబాల గుడిసెల కూల్చివేతపై ఆగ్రహం
కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిదర్శనం : పువ్వాడ
వేలాది పోలీసులతో జేసీబీల దాడి అమానుషం
న్యాయపరంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక.
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల పరిధిలో ఉన్న భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ తమకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సుమారు 600 పేద కుటుంబాలపై వేలాది మంది పోలీసులతో దాడి చేసి, జేసీబీల సహాయంతో గుడిసెలను కూల్చివేయడం అమానుషం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని ఆయన విమర్శించారు.
వెలుగుమట్ల పరిధిలోని సుమారు 60 ఎకరాల భూదాన్ భూముల్లో పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, న్యాయపరంగా కూడా తమ హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో ఈ విధంగా బలప్రయోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టు స్టే పేరుతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు స్వయంగా మంత్రి తుమ్మల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారని ఆరోపించారు.
భూదాన్ భూములపై ఎప్పటినుంచో కొందరు ప్రభావశీలుల కన్ను ఉందని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఈ చర్యలు తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పువ్వాడ పేర్కొన్నారు. తెల్లవారుజామునే భారీ పోలీస్ బలగాలతో పేదల ఇళ్లను ఖాళీ చేయించడం నిరంకుశ పాలనకు నిదర్శనం అని ఆయన అభివర్ణించారు. ఇళ్లను కూల్చివేసి కుటుంబాలను రోడ్డుపైకి నెట్టివేయడం మానవత్వాన్ని మరిచిన చర్యగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందని, మాజీ శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా ప్రజల తరఫున తాను అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేసి, అర్హులైన పేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ వ్యవస్థను వినియోగించడం సరికాదని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆవేదనను ప్రభుత్వం గుర్తించకపోతే తగిన సమయంలో ప్రజలే తీర్పు చెబుతారని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.


