ఘనంగా బీరప్ప కామరాతి కల్యాణం
కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బండారి శ్రీశైలం-సంతోష కుటుంబ సభ్యులు నిర్వహించిన బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. బియ్యం సుంకు, డోలు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల విన్యాసాల మధ్య లింగాలకు గంగస్నానం చేయించి శ్రీశైలం సంతోష నివాసానికి తీసుకొచ్చారు. ఇంటి ఆవరణలో పెద్దపట్నం వేసి బీరప్ప- కామరాతి కల్యాణాన్ని వేడుకగా జరిపించారు. అంతకుముందు మహిళలు బోనాలతో శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు చేశారు.బీరప్ప వేడుకలకు కుర్మ సంఘం మండల అధ్యక్షులు శవల్ల రాజయ్య,గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య,కుల పెద్ద మనిషి బండారి బీరయ్య,బండారి సిద్దయ్య, మాజీ ఉప సర్పంచ్ శెట్టే ఓజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ శెట్టే సిద్దిరాములు, మండల ప్రజా ప్రతినిధులు,కుర్మ సంఘం సభ్యులు,పలు పార్టీల నాయకులు హాజరై పట్నం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.



