హెల్మెట్ తప్పనిసరి… లేదంటే చలాన్లు
డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు
మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరిక
కాకతీయ, మణుగూరు : వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని గౌరా ఓబీ కంపెనీలో కార్మికులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లను వెంటనే క్లియర్ చేసుకోవాలని సూచించారు. వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ తదితర పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని, ముఖ్యంగా యువకులు త్రిబుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీఐ నాగబాబు, ఎస్‌ఐ శ్రావణ్ కుమార్, భాగం సతీష్, పుచ్చకాయల రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



