‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో గజ్వేల్ పోలీసుల అవగాహన
– ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
– ఇందిరాపార్క్ చౌరస్తాలో ప్రత్యేక ప్రచారం
– వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచాలని సూచన
– హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహన ప్రయాణం నిషేధం
– రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై కఠిన హెచ్చరిక
– మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు
– గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్
కాకతీయ, గజ్వేల్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ – అలైవ్’ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తాలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ పాల్గొని వాహనదారులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణించరాదు అని తెలిపారు. మానవ తప్పిదాల వల్లే అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఆటోలను కేటాయించిన ప్రదేశాల్లోనే నిలిపివేయాలి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం అని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయం. అటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అధిక శబ్దంతో స్పీకర్లు వినియోగించడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేశారు. ప్రమాదరహిత సమాజ నిర్మాణానికి ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



