దేవాలయ భూమిపై ఉద్రిక్తత
– మజీద్పల్లి గ్రామంలో 2 ఎకరాల 20 గుంటల భూమి వివాదం
– ఇరు వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని ముదిరాజుల డిమాండ్
– ఎల్లమ్మ గుడి నిర్మాణం తరువాత దుర్గమ్మ గుడి స్థలంపై అభ్యంతరాలు
– 5 ఈత చెట్లు విరిగాయన్న ముదిరాజ్ సంఘం
– కనకదుర్గమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ గుడిలకు తాతముత్తాతల నుంచే పూజలు
– రెవెన్యూ అధికారుల సమగ్ర విచారణకు విజ్ఞప్తి
కాకతీయ, గజ్వేల్ :సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో దేవాలయ భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఖాతా 5022, సర్వే నెంబర్ 56/12/2లో ప్రభుత్వంగా కేటాయించిన 2 ఎకరాల 20 గుంటల భూమిపై హక్కుల అంశం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని గౌడ సంఘం నాయకులు ఇప్పటికే ఎల్లమ్మ గుడి నిర్మించుకోగా, మిగిలిన భూమిని దుర్గమ్మ గుడి కోసం కేటాయించారని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. దుర్గమ్మ గుడి నిర్మాణం కోసం స్థలం చదును చేసే సమయంలో ఒక పెద్ద ఈత చెట్టు, ఐదు చిన్న ఈత చెట్లు విరిగిపోయాయని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ స్థలంలో ఈత మొక్కలు నాటిన విషయం గ్రామస్తులకు తెలిసిందేనని, ఇప్పుడు భూమి మొత్తం గౌడ కులస్తులకే చెందుతుందంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ తాతముత్తాతల కాలం నుంచే కనకదుర్గమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ గుడిలకు పూజలు నిర్వహిస్తున్నామని, గ్రామంలో ఇన్నాళ్లు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని తెలిపారు. ఇప్పుడు దుర్గమ్మ గుడి నిర్మాణానికి ముందుకు వస్తే భూమి కోల్పోతామనే సాకుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మండల రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి ఇరు వర్గాలకు న్యాయం చేయాలని ముదిరాజులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లింగ మల్లయ్య, కల్వకుంట్ల బిక్షపతి, గుంటుక మహేష్, లింగ పాండు, చంద్రం, సురేష్, గుంటుక శంకర్, స్వామి, బాలరాజ్, తలారి స్వామి, రాము, శ్రీను, యాదగిరి, ఆంజనేయులు, సుధాకర్, రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


