* ప్రతీ మండపానికి జియో ట్యాగింగ్
* మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
* నిమజ్జనం రోజున ఇసుక లారీలను ఆపేస్తాం
* అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
* కేటాయించిన తేదీలోనే నిమజ్జనాలకు తరలించాలి
* 400 మంది సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు!
* కాకతీయతో ఇంటర్వ్యూలో ములుగు జిల్లా ఏస్పీ డాక్టర్.పి. శబరీష్!
కాకతీయ, ములుగు ప్రతినిధి : గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ములుగు జిల్లాలోని ఆయా మండలాల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రజలు ప్రశాంత వాతవరణంలో సంతోషంగా నిర్వహించుకునేందుకు ములుగు పోలిస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల, నిమజ్జన సమయంలో ఎక్కడ ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కట్టు దిట్టమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మండలాలలో పోలిస్ అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఏర్పాట్లు, బందోబస్తూ చర్యల పై ములుగు జిల్లా ఏస్పీ డాక్టర్.పి.శబరీష్ కాకతీయతో ప్రత్యేకంగా మాట్లాడారు.
కాకతీయ : గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు.?
ఏస్పీ : గత సంవత్సరం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈసారి కొత్తగా ప్రతి గణేష్ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆర్గనైజర్లను ప్రోత్సహిస్తున్నాం. గణేష్ మండపాలను జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్‌తో సమన్వయం చేసుకుంటూ ఊరేగింపు జరిగే దారిలో తక్కువ ఎత్తులో ఉన్నటువంటి కరెంటు తీగలను ఎత్తు పెంచేలాగా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని వర్గాల ప్రజలతో శాంతి చర్చలు నిర్వహించాము. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము.
మండపాల నిర్వాహాకులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమజ్జన తేదీలకు అనుగుణంగా రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు నిర్వహిస్తున్నాం.
కాకతీయ : ట్రాఫిక్ నియంత్రణకు చేస్తున్న ఏర్పాట్లు ఏమిటి.?
ఏస్పీ : నిమజ్జనం జరిగే ప్రదేశాలను ముందుగానే గుర్తించినందున దానికి తగ్గట్టుగా రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశాం. వరంగల్, హన్మకొండలతో పాటు ఇతర పట్టణాల నుంచి గోదావరిలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారిపై ట్రాఫిక్ రూల్స్ పాటించేలా పోలీసులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ములుగు జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో కేటాయించిన చెరువుల వద్ద రెస్క్యూ టీంలతో కలిసి పోలీసులు విధులు నిర్వహిస్తారు. అవసరమైన ప్రదేశాలలో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇసుక లారీలు, భారీ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.
కాకతీయ : ఏంత మంది పోలిస్ సిబ్బంది విధుల్లో ఉంటారు..? అదనపు సిబ్బంది కేటాయిస్తున్నారా..?
ఏస్పీ : ములుగు జిల్లాలో సుమారు 400 మంది సివిల్, ఏఆర్, టిఎస్ఎస్పి, స్పెషల్ పార్టీ, క్యూఆర్టి, (డీడీఆర్ఏఫ్) సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.
కాకతీయ : జిల్లాలో ఏన్ని విగ్రహలు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదయ్యాయి..?
ఏస్పీ : ములుగు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 700 పైచిలుకు అప్లికేషన్లు నమోదు చేయబడ్డాయి. కానీ ఇంకా కొన్ని గ్రామాలలో ప్రజలు అప్లికేషన్లు చేయలేదని తెలిసింది. వారి వద్దకు ఆయా విలేజ్ పోలీస్ ఆఫీసర్లను పంపి ఆన్లైన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మండపం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా చూస్తాం.
కాకతీయః- నిమజ్జనం జరిగే ప్రదేశాలేవీ..? ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?
ఏస్పీ : ములుగులో తోపుకుంట చెరువు, వెంకటాపూర్‌లో నల్ల కాలువ, పస్రాలో గౌరారం చెరువు మరియు రంగాపూర్ కాలువ, తాడ్వాయిలో జంపన్న వాగు, ఏటూరు నాగారం మంగపేట వాజేడు వెంకటాపురం మండలాల ప్రజలు ముళ్లకట్ట వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశాం. రెవెన్యూ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం. సుమారు 05 క్రేన్లు, లైటింగ్, జీపీ స్టాఫ్, స్విమ్మర్లు, డీడీఆర్ఏఫ్ సిబ్బందిని ఏర్పాటు చేస్తాం.
కాకతీయః- నిమజ్జనం రోజున ఇసుక లారీల పై ఏమైన ప్రత్యేక ఆంక్షలు విధిస్తున్నారా.?
ఏస్పీ : అవును ఆరోజు ఇసుక లారీలు నడవకుండా చూస్తాం. ఈ విషయంలో మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకుంటాం.
కాకతీయ : ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి.?
ఏస్పీ: ప్రజలందరూ సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని మా ఉద్దేశం. అలాగే ముందుగా నిర్ణయించుకున్న నిమజ్జనం తేది నాడు పోలీసు వారు నిర్ణయించిన చోట నిమజ్జనం చేయాలి. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎల్లవేళలా ప్రజల రక్షణ కోసం పాటుపడే పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.


