అమ్మో పులి… ఏజెన్సీ గ్రామాల్లో గుబులు
మైలారం–రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పులి సంచారం
ఒంటరిగా అడవికి వెళ్లొద్దని అటవీశాఖ హెచ్చరిక
పశువుల కాపరులు, తునికాకు కార్మికుల్లో ఆందోళన
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో పులి సంచారం ప్రచారం కలకలం రేపుతోంది. మైలారం, రేగళ్ల, గట్టు మల్ల, బంగారు చిలక అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతోందన్న సమాచారంతో గిరిజన గ్రామాల్లో భయం నెలకొంది. ఒంటరిగా అడవికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో మరింత గుబులు మొదలైంది. ఒకప్పటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా పేరొందిన ఈ దట్ట అటవీ మండలాల్లో ప్రస్తుతం పులి సంచరిస్తోందన్న ప్రచారం రైతులు, కూలీలలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పూడు వ్యవసాయం చేపట్టిన రైతులు అడవికి వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. పశువులను అడవిలో మేపే కాపరులు కూడా అప్రమత్తమయ్యారు. అటవీశాఖ పులి సంచరిస్తోందని చెబుతున్నప్పటికీ, పాదముద్రల స్పష్టమైన ఆధారాలు చూపించలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. “పులి ఉన్నట్లయితే పాదముద్రలు, కెమెరా ట్రాప్ చిత్రాలు చూపించాలి. భయపెట్టి అడవికి వెళ్లొద్దంటున్నారు” అని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. పాదముద్రల సేకరణలో అటవీశాఖ మరింత స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

వేసవికాలం… ఉపాధిపై ప్రభావం
వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు సేకరణకు సిద్ధమవుతున్న గిరిజనులకు ఈ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తునికాకు సేకరణే ప్రధాన ఉపాధి కావడంతో, పులి సంచారం భయంతో అడవికి వెళ్లలేకపోతే జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు వంటచెరుకు కోసం ప్రతిరోజూ అడవికి వెళ్తుంటారు. ఇప్పుడు పులి సంచారం ప్రచారంతో అడవికి వెళ్లడానికి భయపడుతున్నారు. పశువులను అడవిలో మేపేందుకు కూడా కుటుంబాలు వెనుకంజ వేస్తున్నాయి. “ఒకవేళ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని పశువుల కాపరులు ప్రశ్నిస్తున్నారు.
ఆళ్లపల్లి నుంచి మైలారం దాకా?
ఇటీవల ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో సంచరించిన పులి ప్రస్తుతం రేగళ్ల, మైలారం, గట్టు మల్ల ప్రాంతాలవైపు కదిలిందని అటవీశాఖ ప్రచారం చేస్తోంది. నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు వేసవిలో వన్యప్రాణులు రావడం సహజమేనని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం పులి నిజంగానే ఉందా? లేక అప్రమత్తం కోసం హెచ్చరికలా? అన్న సందేహంలో ఉన్నారు.
“ప్రజలను అలెర్ట్ చేస్తున్నాం”
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారంతో అప్రమత్త చర్యలు చేపట్టామని అటవీశాఖ బీట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. “గ్రామస్తులు ఒంటరిగా అడవికి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాం. అనుమానిత ప్రాంతాల్లో సిబ్బంది పర్యటిస్తూ పాదముద్రల కోసం పరిశీలిస్తున్నారు. అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం” అని వివరించారు.


