స్నేహితుడే హంతకుడు..!
యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు ఛేదించిన పోలీసులు
స్నేహితుడు మేకల వేణుమాధవ్ రెడ్డితో ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు
తనను మోసం చేశాడని భావించిన వేణు మాధవ్‌రెడ్డి
శ్రీనివాస్ హత్యకు సుపారీ ఇచ్చి ప్రీ ప్లాన్డ్‌గా అంతం
పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లినట్లుగా ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
సాంకేతిక ఆధారంగా కేసును చేధించిన ఖమ్మం పోలీసులు
నలుగురి అరెస్టు చేసి..కటాకటాల వెనక్కి పంపిన ఖాకీలు
కాకతీయ, కూసుమంచి : పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో మళ్లీ కలిసిన ఇద్దరు స్నేహితులు… ఆ పరిచయం చివరకు నరహత్యగా మారింది. ఈ నెల 14న పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన వెనుక రోడ్డు ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్యేనని పోలీసులు తేల్చారు. ఆదివారం రూరల్ ఎసిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎసిపి తిరుపతి రెడ్డి, కూసుమంచి సీఐ టి. సంజీవ్ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్ అలియాస్ బొగ్గుల శ్రీనివాస్ (48) ఈనెల 14న పాలేరు జలాశయంలో మృతి చెందిన ఘటన మొదట అనుమానాస్పదంగా కనిపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో అసలు కథ వెలికితీశారు.

జీఎస్టీ లావాదేవీలే వివాదానికి కారణం
మృతుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. సిల్వర్ జూబ్లీ కాలేజీలో కలిసి చదివిన మేకల వేణుమాధవ్ రెడ్డి (ఏ1)తో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ పరిచయం ఏర్పడింది. మృతుడికి “బొగ్గుల బిబిక్యూ” పేరిట జీఎస్టీ లైసెన్స్ ఉండగా, వేణుమాధవ్ రెడ్డి “మేకా ప్రాజెక్ట్స్” పేరిట సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. జీఎస్టీ లైసెన్స్ వినియోగించి నకిలీ ఇన్వాయిస్‌లు దాఖలు చేసి లాభాలు పొందుదామని ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. 2022 నుంచి 2025 వరకు సుమారు రూ.90 లక్షలు సంపాదించగా, అందులో శ్రీనివాస్ వాటా రూ.45 లక్షలు. అయితే వేణుమాధవ్ రెడ్డి రూ.15 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా రూ.30 లక్షలు బకాయి ఉంచాడు. ఇదే సమయంలో జీఎస్టీ విభాగం నోటీసులు రావడంతో లైసెన్స్ రద్దైంది. లైసెన్స్ యాక్టివేషన్‌కు భారీ జరిమానా చెల్లించాల్సి రావడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది.
సుపారీ ఇచ్చి పక్కా ప్లాన్
ఆర్థిక ఒత్తిడి, బకాయి డబ్బుల డిమాండ్ కారణంగా ఏ1 వేణుమాధవ్ రెడ్డి, ఏ2 పోకల కోటేశ్వరరావు, ఏ3 షేక్ అబ్దుల్ హఫీజ్, ఏ4 ఎమ్.డి. అజ్మత్ అలీ ఖాన్‌లతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఏ3, ఏ4లకు రూ.5 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈనెల 13న రాత్రి పెండింగ్ డబ్బులు ఇస్తామని చెప్పి శ్రీనివాస్‌ను వాహనంలో విజయవాడకు తీసుకెళ్లారు. 14వ తేదీ తెల్లవారుజామున నకిరేకల్–జనగాం మార్గంలోని నిర్మానుష్య ప్రాంతంలో కత్తులు, ఐరన్ రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహంతో పాటు కారును పాలేరు జలాశయంలో పడవేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. హత్యలో ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కేసు నమోదు వెంటనే ఎసిపి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.



