ఆస్పత్రికొస్తే కొత్త రోగాలు
కొత్తగూడెం ఆస్పత్రిలో శుభ్రత అధ్వానం
ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు
వార్డుల పక్కనే ఆసుపత్రి వ్యర్థాలు..!
పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు
తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల పారిశుధ్య సమస్యలతో విమర్శలకు గురవుతోంది. జిల్లాలో ప్రధాన ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ దవాఖానలో రోగుల వార్డుల పక్కనే ఆసుపత్రి వ్యర్థాలను కుప్పలుగా వేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు ఈ పరిస్థితిని చూసి కలవరపడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే, వ్యర్థాల కారణంగా కొత్త వ్యాధులు సోకే ప్రమాదం ఉందని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వార్డుల పక్కనే చెత్త కుప్పలు
ఆసుపత్రి ఆవరణలో డస్ట్‌బిన్లు ఉన్నప్పటికీ వ్యర్థాలను వాటిలో వేయకుండా ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా వేయడం గమనార్హం. ముఖ్యంగా రోగుల వార్డుల సమీపంలోనే వైద్య వ్యర్థాలు పడేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా దుర్వాసన వ్యాపిస్తూ రోగులు, సందర్శకులకు అసౌకర్యం కలిగిస్తోంది. ఆసుపత్రి జనరేటర్ సమీపంలో కూడా చెత్త పేరుకుపోయి రోజులు గడుస్తున్నా వాటిని తొలగించే చర్యలు కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పారిశుధ్యంపై అధికారుల నిర్లక్ష్యం
జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఈ దవాఖానలో పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నదని విమర్శిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం కనిపించాల్సిన చోట చెత్త కుప్పలు కనిపించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి ఆసుపత్రి పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని, తగిన సంఖ్యలో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసి వ్యర్థాలను సక్రమంగా నిల్వ చేసి తరలించే చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోగులకు ఆరోగ్యాన్ని అందించే ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



