రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కాకతీయ, రామకృష్ణాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ శనివారం క్యాతన్‌పల్లి నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులపై ఒత్తిళ్లు తేవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల కమిషన్, మహిళా కమిషన్, న్యాయస్థానాలను ఆశ్రయించినట్లు తెలిపారు. వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి బొమ్మ భూమయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


