ప్రజ్ఞాపూర్ గురుకుల పాఠశాలకు రూ.2.40 లక్షల విలువైన సామగ్రి అందజేత
– భోజన టేబుళ్లు, బెంచీలు, ఫైల్ అలమారల పంపిణీ
– విద్యార్థుల సౌకర్యాల కోసం రాణే సంస్థ ముందడుగు
– మౌలిక వసతులతో చదువుపై మరింత శ్రద్ధ సాధ్యం
– భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలకు హామీ
– సంస్థ ప్లాంట్ అధిపతి జి. శ్రీనివాస్
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలకు రాణే (మద్రాస్) లిమిటెడ్, బీసీడీ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.2.40 లక్షల విలువైన సామగ్రిని విద్యార్థుల సౌకర్యార్థం 8 భోజన టేబుళ్లు, 16 బెంచీలు, 4 ఫైల్ అలమారలను పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్లాంట్ అధిపతి జి. శ్రీనివాస్ మాట్లాడుతూ… పాఠశాలలో తగిన మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. చదువుతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెరుగుతాయని తెలిపారు. పాఠశాలలో అవసరమైన ఇతర సదుపాయాలను కూడా పరిశీలించి సాధ్యమైనంత మేర సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ మానవ వనరుల విభాగాధిపతి వీర్ భద్రయ్య మాట్లాడుతూ… సరైన వసతులు కల్పించడం ద్వారా విద్యార్థుల అభ్యాసం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సంస్థ తరఫున మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సంస్థ అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు డి. భిక్షపతి, ఉప మానవ వనరుల అధికారి కె. సురేందర్ రెడ్డి, మానవ వనరుల ప్రతినిధి వై. వేణు కుమార్, ఉత్పత్తి విభాగాధిపతి శ్రీనివాస్, భద్రతా విభాగాధిపతి వి.ఎస్. దామోదర్, ఉప ప్రధానోపాధ్యాయుడు సూర్యారావు, కృష్ణారెడ్డి, సంఘ సభ్యులు ఎస్.కే. సాజిద్, శ్రీనివాస్ తదితరులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


