క్యాన్సర్‌పై ముందస్తు అవగాహనతో ప్రాణానికి రక్షణ
హాస్పిటల్ హెల్త్ ఆఫీసర్ డా. డి. లలిత కుమారి
కొత్తగూడెం జీఎం కార్యాలయంలో అవగాహన సదస్సు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఆదేశాల మేరకు శుక్రవారం జీఎం కార్యాలయంలో క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. మెడికల్, హెల్త్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మెయిన్ హాస్పిటల్ హెల్త్ ఆఫీసర్ డా. డి. లలిత కుమారి మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న నిర్వహిస్తారని తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల చికిత్స ప్రాముఖ్యతను తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. పొగాకు వినియోగం, మద్యపానం, అసమతుల్య ఆహారం, వ్యాయామం లోపం, కాలుష్యం వంటి కారణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా మహిళలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం జి.వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, ఏజీఎంలు, వైద్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


