శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం సభల ద్వారా అంగన్వాడి, వైద్య సిబ్బంది నివేదికలను సమీక్షిస్తూ గ్రామస్థాయి ప్రజారోగ్య పరిస్థితులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
తల్లి–శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం
తల్లీ–పిల్లల ఆరోగ్యం, పోషణలో శుక్రవారం సభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యంపై ఏవైనా సందేహాలు ఉన్నా సభల ద్వారా ప్రభుత్వ వైద్యులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల వారీగా అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రతి నెల నివేదికలు సేకరిస్తున్నామని వెల్లడించారు.బరువు తక్కువగా ఉన్న శిశువులను గుర్తించి వారి ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు ఎన్ఆర్సి కేంద్రాల్లో చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకువస్తున్నామని చెప్పారు.
మహిళల ఆరోగ్య పరీక్షల్లో మంచి స్పందన
శుక్రవారం సభల ద్వారా నిర్వహించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. 95 శాతం మహిళలు వైద్య పరీక్షలను వినియోగించుకోగా, 245 మందికి రెండో దశ స్క్రీనింగ్ పూర్తయిందని తెలిపారు. హెల్త్ క్యాంపులను మరింతగా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.
విద్యార్థుల హాజరుపై దృష్టి
పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు, ప్రత్యేక తరగతులకు పంపించాలని కలెక్టర్ సూచించారు.
సర్పంచ్లకు అభినందనలు
శుక్రవారం సభల నిర్వహణలో మహిళా సర్పంచులు చూపుతున్న చొరవ అభినందనీయమని తెలిపారు.కార్యక్రమం అనంతరం గర్భిణీలకు సీమంతాలు, శిశువులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్య అధికారి వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పురం మాధవి, ఉపసర్పంచ్ వేముల శేఖర్, సిడిపిఓ నర్సింగారాణి తదితరులు పాల్గొన్నారు.


