అక్రమ కేసులతో భయపెట్టలేరు
పర్మిషన్ ఉన్నా బీఆర్ఎస్ నాయకులపై ఉల్టా కేసులు
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలం
ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు దేవి రవీందర్
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం
కాకతీయ, గజ్వేల్ : అక్రమ కేసులతో బెదిరించినా వెనక్కి తగ్గేది లేదని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు దేవి రవీందర్ స్పష్టం చేశారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముంపు గ్రామాల్లో ప్రచారం చేస్తే కాంగ్రెస్ నాయకుల బండారం బయటపడుతుందని, ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటేస్తారనే భయంతోనే ఆయన ప్రచారాన్ని అడ్డుకునేందుకు దాడులకు దిగారని ఆరోపించారు. ముందస్తు అనుమతి తీసుకొని ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేసి, ఉల్టా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్నామని, రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన తమను కేసులతో భయపెట్టడం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులపై కేసుల రాజకీయానికి పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్లు ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులపై ఎన్ని కేసులు నమోదయ్యాయో, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టించారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టి సాధించినదేమిటో ప్రజలకు చెప్పాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కిరణ్ కుమార్, చారి, బచ్చలి మైపాల్, నర్సింహారెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు నగేష్, శివకుమార్, భాస్కర్, రామ్‌రెడ్డి, పెంటారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.


