విదేశీ ఉన్నత విద్యపై అవగాహన
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ
నైపుణ్యాభివృద్ధిపై నిపుణుల మార్గదర్శనం
అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఐఈఎల్టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం) విదేశీ ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం ప్రోత్సాహంతో బీసీ స్టడీ సర్కిల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఫోరం, ప్లేస్‌మెంట్ సెల్, టీఎస్‌కేఎస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అనిత అబ్రహం మాట్లాడుతూ… ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమర్థవంతమైన భావవ్యక్తీకరణ నైపుణ్యాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఐ ఈ ఎల్ టి ఎస్ వంటి శిక్షణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని తమ భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కమల క్రిస్టియాన అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను సాధించాలంటే భాషా ప్రావీణ్యంతో పాటు సమగ్ర నైపుణ్యాలు అవసరమని వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ పి. కృష్ణ దయాసాగర్ హాజరై మాట్లాడారు. రిసోర్స్ పర్సన్స్ ఇర్ఫాన్ ఖాన్, సమిరన్ రాయ్‌లు ఐ ఈ ఎల్ టి ఎస్ పరీక్ష ఉద్దేశ్యం, ప్రాముఖ్యత, విదేశీ ఉన్నత విద్య సాధించే విధానాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ శోభారాణి, డాక్టర్ శ్రీలత, కళాశాల ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ ఎం.ఎం. లక్ష్మి మాట్లాడుతూ… వారం రోజుల పాటు జరుగనున్న శిక్షణలో విద్యార్థులు పాల్గొని అంతర్జాతీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు మహమ్మద్ అన్వర్, స్వర్ణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.


