పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు
కృషి, పట్టుదలతోనే విజయం సాధ్యం
ప్రిన్సిపల్ ఎస్. గణపతి రావు
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రభుత్వ అటానామస్ డిగ్రీ కళాశాలలో బుధవారం గణిత విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఎస్. గణపతి రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, కృషి, పట్టుదలతో కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. స్పష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణగా చదివితే విజయాన్ని సాధించవచ్చన్నారు. కార్యశాలలో విషయ నిపుణులుగా పాల్గొన్న విశ్రాంత ఆచార్యులు డాక్టర్ వంగల శ్రీనివాసులు పోటీ పరీక్షల విధానం, అర్హతలు, పాఠ్యాంశాలు, పరీక్షా విధానం వంటి అంశాలను వివరించారు. పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన సులభమైన పద్ధతులను తెలియజేశారు. కార్యశాల కన్వీనర్ డాక్టర్ డి. వెంకటేష్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో సరైన ప్రణాళిక, సమయపాలన, నిరంతర సాధన అవసరమని చెప్పారు. డిగ్రీ పూర్తయ్యే నాటికి విద్యార్థులు ఉద్యోగాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుని సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ జి. విజయభాస్కర్ రెడ్డి, గణితశాస్త్ర అధ్యాపకురాలు జీ. వనజ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


