పేదింటి పెళ్లికి బీఆర్ఎస్ కౌన్సిలర్ దంపతుల చేయూత
– కొల్గురు గ్రామంలో సేవా కార్యక్రమం
– కావ్య వివాహానికి పుస్తె మట్టెలు అందజేత
– ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఊరటనిచ్చిన సహాయం
– అవసరమైనప్పుడు ప్రజల పక్కనే ఉంటాం
– కౌన్సిలర్ గోలి మమత సంతోష్ కుమార్
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గురు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ కుమార్ దంపతులు చేయూత అందించారు. పురం నర్సింలు కుమార్తె కావ్య వివాహం సందర్భంగా అవసరమైన పుస్తె మట్టెలను అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా గోలి మమత సంతోష్ కుమార్ దంపతులు మాట్లాడుతూ… పేద కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా నిలబడటం తమ బాధ్యత అని తెలిపారు. ప్రజల సహకారంతోనే తాము ఈ స్థాయికి వచ్చామని, అదే ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం చేయడం తమ విధిగా భావిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ కుమార్ దంపతులకు పురం ఆంజనేయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ కుటుంబాలకు వివాహం నిర్వహించడం ఒక పెద్ద బాధ్యత. అలాంటి సమయంలో అందిన ఈ సహాయం కుటుంబానికి ఎంతో ఉపశమనం కలిగించిందని స్థానికులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ చేయూత వారికి ధైర్యం ఇచ్చిందని గ్రామ పెద్దలు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొడుగు జ్యోతి స్వామి, గజ్వేల్ మండల బీసీ సెల్ అధ్యక్షులు పురం ఆంజనేయులు, పురం గణేష్, బోండ్ల సాకేత్, మంద బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.


