భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్లు
వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్లకు కోర్టు గ్రీన్ సిగ్నల్
నీరు, విద్యుత్ వంటి కనీస వసతులు వెంటనే కల్పించాలి
పేదలను బెదిరించేందుకు పోలీసుల జోక్యం ఆపాలి
భూదాన భూములపై కబ్జాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
కోర్టు ఆదేశాలను విస్మరిస్తే న్యాయపరమైన చర్యలు తప్పవు
రాజ్యాంగం ప్రకారం పేదలకు న్యాయం చేయాలి
కోర్టు ఆదేశాలు అమలు చేయాలి
మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్
కాకతీయ, ఖమ్మం : కోర్టు ఆదేశాల మేరకే ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూముల్లో పేదలు ఇళ్లస్థలాలు ఏర్పాటు చేసుకున్నారని, వారికి వెంటనే నీటి సరఫరా, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2014లో వెలుగుమట్లలోని భూదాన భూమిని పేదల ఇళ్లస్థలాల కోసం కేటాయించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు అక్కడ కనీస వసతులు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పోలీసులు జోక్యం చేసుకోవడం మానుకోవాలి
భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలను భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పోలీసుల జోక్యం పూర్తిగా నిలిపివేయాలని జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించడం ప్రతి అధికారిక సంస్థ బాధ్యత అని, వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూదాన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. పేదలను అక్కడి నుంచి తొలగిస్తే ఆ భూములను ఆక్రమించే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తప్పవు
భూదాన భూములను అమ్మే హక్కు గానీ, కొనుగోలు చేసే హక్కు గానీ ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పేదలను వేధిస్తే సంబంధిత అధికారులపై న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి వెలుగుమట్ల భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు నీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూ పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో భారత–చైనా మిత్రమండలి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ మోహన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శి డి. విజయేందర్, లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు భద్రు నాయక్, బిసి, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు రాంబాబు, యర్రా బాబు తదితరులు పాల్గొన్నారు.


