కొమరవెల్లి లో ఘనంగా పెద్ద పట్నం
*మల్లన్న నామస్మరణ చేస్తూ పట్నం తొక్కిన భక్తులు
కాకతీయ, చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం లింగోద్భవ కాలంలో రాత్రి 12 గంటల తర్వాత స్వామివారికి మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు, సేవా కార్యక్రమాలను జరిపి సోమవారం ఉదయం రెండు గంటల నుండి దాదాపు నాలుగు గంటల వరకు పెద్దపట్నం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్దపట్నం వేయడం అంటే స్వామివారి కల్యాణాన్ని యాదవుల ఆచారం ప్రకారం రెండుసార్లు చేస్తున్నట్లుగా భావిస్తారు. ఈ పెద్దపట్నం కార్యక్రమంలో భాగంగా ఆలయ తోట బావి వద్ద ఒగ్గు పూజారులు పసుపు, కుంకుమ, తెల్ల పిండి, పచ్చ, బుక్క గులాలను వాడి పెద్ద పట్నాన్ని రచించారు. సాంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారులు మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయము నుండి అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చి పెద్దపట్నం వద్ద పూజలు చేసి కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న అంటూ పెద్ద పట్నాన్ని దాటారు. అనంతరం భక్తులు మల్లన్న నామస్మరణ చేస్తూ పెద్దపట్నాన్ని దాటుతూ తమ కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు. దీంతో కొమరవెల్లి బండారుమయంగా మారింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్ ఆదేశాలతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ పెద్దపట్నం కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో అన్న పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్ తో పాటు అర్చకులు పాల్గొన్నారు.



