మృత్యుంజయ స్వామి సన్నిధిలో భట్టి ప్రత్యేక పూజలు
సీఎం, మంత్రుల పేరిట గోత్రనామాలతో అర్చన
రాష్ట్ర సుభిక్షం కోసం మొక్కులు చెల్లించిన డిప్యూటీ సీఎం
కాకతీయ,ఖమ్మం బ్యూరో : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి గర్భాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని, పాలకవర్గంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని మొక్కులు చెల్లించారు. ఆలయానికి చేరుకున్న భట్టి దంపతులకు ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


