ఆలయాల్లో శివనామస్మరణం
మహాశివరాత్రికి పోటెత్తిన భక్తులు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో శివనామ స్మరణం మారుమోగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని వారి వారి మొక్కులను చెల్లించుకున్నారు. కొత్తగూడెంలోని రైటర్ బస్తీలో ఉన్న త్రిమాత గుడి, విద్యానగర్ కాలనీలోని శివాలయంలో భక్తుల రాకతో మహాశివరాత్రి శోభ నెలకొంది. శివభక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి తెల్లవారుజామున సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకాలు చేసి, బిల్వదళాలు సమర్పిస్తూ శివుని ఆశీస్సులు కోరుకున్నారు. ఆలయాల పరిసరాలు “ఓం నమఃశివాయ” నినాదాలతో మారుమోగాయి. భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల భక్తి, ఆధ్యాత్మిక ఉత్సాహం స్పష్టంగా కనిపించింది.


