క్రీడలతోనే యువతకు శారీరక–మానసిక దృఢత్వం
నాలుగు మండలాల స్థాయి క్రికెట్ పోటీల ప్రారంభం
విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ దశరథ్‌నాయక్
కాకతీయ / ఏన్కూర్ : గ్రామీణ స్థాయి నుంచే యువత క్రీడా స్పూర్తితో ఎదగాలని కోదాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్‌నాయక్ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఏన్కూరు మండల పూర్వ క్రీడాకారుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నాలుగు మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో స్నేహభావం పెంపొందించడమే కాకుండా శారీరక దారుడ్యంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు పూర్వ క్రీడాకారులు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత నాలుగేళ్లుగా ట్రోఫీలు అందజేస్తున్న దాత చావా మోహన్‌రావును ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్ పోటీల్లో తల్లాడ జట్టు ప్రథమ స్థానాన్ని, ఏన్కూరు జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా డాక్టర్ దశరథ్ దంపతులను క్రీడాకారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుగులోతు లచ్చిరాం నాయక్, కాంగ్రెస్ నాయకులు చందూలాల్, హరిలాల్ నాయక్, ఉపాధ్యాయులు నునావత్ శ్రీనివాసరావు, పూర్వ క్రీడాకారులు ఏర్పుల సుధాకర్, రాంబాబు, నాని తదితరులు పాల్గొన్నారు.


