వైరా కౌన్సిలర్లకు పువ్వాడ సన్మానం
బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల విజేతలకు అభినందనలు
ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కారం
ప్రజల తరఫున కౌన్సిల్లో పోరాడాలని సూచన
పొత్తులతో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చామన్న మాజీమంత్రి అజయ్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీల నూతన కౌన్సిలర్లను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కట్టా స్వరూప రాణి, తిరుపతి శివకుమారి, చిలక చిన్న కోటయ్య, కిన్నెర కృష్ణ, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, మాదినేని సునీత, నల్లమోతు శైలజలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మిత్రపక్షాలు కలసి సమన్వయంతో పోటీ చేసి అధికార పార్టీకి గట్టి సవాల్ విసిరాయని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కౌన్సిల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని నూతన కౌన్సిలర్లకు సూచించారు. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్కు ఎదురులేదని భావించిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ధైర్యంగా పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని పొందారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు ఏర్పడటం బీఆర్ఎస్ బలం ఏ మేరకు ఉందో చూపిస్తోందని పేర్కొన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా హంగ్ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, జిల్లా నాయకులు మంజుల మదనలాల్, లకావత్ గిరిబాబు, మాజీ ఎంపీపీ కృష్ణార్జునరావు, సీనియర్ నాయకులు విశ్వేశ్వరరావు, వైరా మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, టౌన్ అధ్యక్షుడు సురేష్, సిపిఎం కార్యదర్శి భూక్యా వీరభద్రం, సిపిఐ కార్యదర్శి ఎర్రా బాబు, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


