విలీన గ్రామాల సమస్యపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన
కాకతీయ వరస కథనాలతో చర్చ ముమ్మరం
కాకతీయ,మణుగూరు టౌన్ : మణుగూరు పరిధిలో విలీనం చేసిన రాయిగూడెం,అన్నారం,కమలాపురం తదితర గ్రామాలకు కేంద్ర పథకాలు అందకపోవడంతో కాకతీయ వరస కథనాలతో ప్రజల్లో అవగాహన వేగంగా పెరుగుతోంది.ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అమలు కాకపోవడంతో గత రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇప్పుడు గ్రామస్తులు బహిరంగంగా మాట్లాడుతున్నారు.ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన కాకతీయ పేపర్ కథనాల తరువాత గ్రామాల్లో చర్చలు మరింత ఉధృతమయ్యాయి.స్థానిక యువత,కార్మిక వర్గాలు,మహిళా సంఘాలు సమస్య తీవ్రతను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడం గమనార్హం.

“మాకు హక్కులు కావాలి” గ్రామస్తుల మాటల్లో..
“పంచాయతీ గా ఉన్నప్పుడు ఉపాధి హామీ పనులు వచ్చేవి.ఇప్పుడు ఏ పథకం లేదు.మేము దేనికి చెందుతామో స్పష్టత లేదు” అని కమలాపురానికి చెందిన ఓ మహిళ పేర్కొన్నారు.
“పట్టణ పరిధిలో ఉన్నామని చెబుతారు,కానీ పట్టణ సదుపాయాలు కూడా రావు” అని రాయిగూడెం యువకులు వాపోతున్నారు.
గ్రామస్తుల మాటల్లో స్పష్టంగా వినిపిస్తున్నది ఒకటే..విలీనంతో అభివృద్ధి రావాల్సింది పోయి, ఉపాధి కూడా కోల్పోయామని మోర పెట్టుకుంటున్నారు.
యువత ముందుకు…
కాకతీయ పేపర్ వరస కథనాల ప్రభావంతో యువత సమస్యపై డేటా సేకరణ ప్రారంభించింది.గత 20 ఏళ్లలో ఉపాధి హామీ కింద ఎంతమంది లబ్ధి పొందలేదన్న వివరాలను సేకరించి అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని యోచిస్తున్నది.గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి సమస్యలపై అవగాహన పెంచుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో చర్చ
#MergedVillages #MGNREGS #Manuguru వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెరుగుతున్నాయి. “గ్రామం కాదు… పట్టణం కాదు…మాకు హక్కులు ఎక్కడ?” అనే ప్రశ్న వైరల్ అవుతోంది.
ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్
గ్రామస్తులు,సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విలీన గ్రామాలకు ఉపాధి హామీ పథకాన్ని ప్రత్యేక అనుమతితో అమలు చేయాలా?లేక సమాన ఉపాధి అవకాశాలను కల్పించాలా?లేదా విలీన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలా?అన్న అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర
ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యతగా భావిస్తున్న కాకతీయ పేపర్ ఈ అంశాన్ని కొనసాగిస్తూ గ్రౌండ్ రిపోర్ట్లు, నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తోంది.సమస్య పరిష్కారం దిశగా చర్చ సాగాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


