కల్లూరుపై కాంగ్రెస్ జెండా
20 వార్డుల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
బీఆర్ఎస్‌కు 7 వార్డులు, ఒక్క చోట ఇండిపెండెంట్ గెలుపు
తొలిసారి మున్సిపాలిటీలో అధికార పార్టీకే ప్రజల మద్దతు
అభివృద్ధి ఆశలతో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ఓటర్లు
కాకతీయ, కల్లూరు : తొలిసారిగా మున్సిపాలిటీగా ఏర్పడిన కల్లూరులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 20 వార్డులున్న కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 12 వార్డులను కైవసం చేసుకుని అధికారాన్ని దక్కించుకుంది. దీంతో కల్లూరు మున్సిపల్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టమైంది. అభివృద్ధి సాధించాలంటే అధికార పార్టీకే మద్దతు ఇవ్వాలనే ప్రచారం ప్రజల్లో ప్రభావం చూపినట్లు ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో అభివృద్ధి ఆశలతో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కట్టబెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్‌కు పరిమిత విజయాలు
ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. మొత్తం 7 వార్డుల్లో మాత్రమే గెలుపొందుతూ రెండో స్థానానికి పరిమితమైంది. కొన్ని వార్డుల్లో పోటీ హోరాహోరీగా సాగినా తుది ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత ప్రజాదరణతో గెలుపొందిన ఈ అభ్యర్థి ఫలితాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడం ద్వారా పాలనను చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రజలు ఆశించిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు అందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


