కొత్తగూడెం కార్పొరేషన్‌లో హోరాహోరీ
కాంగ్రెస్–సీపీఐ సమాన సీట్లు
మేయర్ పీఠంపై ఉత్కంఠ
కూటమి లేకుండానే పోటీ చేసిన ప్రధాన పార్టీలు
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఉత్కంఠ రేపాయి. మొత్తం 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు చెరో 22 స్థానాలు గెలుచుకుని సమానంగా నిలిచాయి. దీంతో కార్పొరేషన్‌లో ఆధిపత్యం ఎవరిదనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇతర పార్టీలైన బీఆర్ఎస్ 8, సీపీఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 6 స్థానాలు గెలుచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి 22 డివిజన్లలో విజయం లభించగా, సీపీఎం మద్దతుతో మరో ఒక డివిజన్‌లో గెలుపొందడంతో కాంగ్రెస్ బలం 23కు చేరింది. సీపీఐ కూడా 22 డివిజన్లలో గెలిచి గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ 8 స్థానాలకు పరిమితమవగా, సీపీఎం, బీజేపీ చెరో ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు 6 డివిజన్లలో విజయం సాధించి కీలకంగా మారారు.
కూటమి లేకుండా పోటీ… ఫలితాల్లో సమాన సీట్లు
కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్–సీపీఐ కూటమి ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ, చివరకు రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. సీపీఐ తరఫున జాతీయ నాయకుడు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కార్మిక సంఘాల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం ఫలితంగా సీపీఐ 22 స్థానాలు గెలుచుకుని తన బలాన్ని నిరూపించింది. ఇక కాంగ్రెస్ తరఫున రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం వల్ల కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలతో రెండు పార్టీల శ్రేణుల్లో సంబరాలు కనిపించాయి.
మేయర్ పీఠంపై ఉత్కంఠ
కాంగ్రెస్, సీపీఐ సమానంగా సీట్లు సాధించడంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందనే అంశం కీలకంగా మారింది. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల మద్దతు ఎవరికివస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్‌లో సంఖ్యాబలం సమానంగా ఉండటంతో మేయర్ ఎన్నిక వరకు రాజకీయ చర్చలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం అధికార పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపింది.


