అశ్వారావుపేటలో కాంగ్రెస్ సునామీ..!
22 వార్డుల్లో 19 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
చైర్మన్ పీఠం కైవసం
కాకతీయ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకెళ్లింది. మొత్తం 22 వార్డుల్లో అధిక భాగం కాంగ్రెస్ ఖాతాలో పడడంతో మున్సిపాలిటీపై ఆ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం నెలకొల్పింది. ప్రారంభం నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు నమోదు చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు అవకాశాలు పరిమితమయ్యాయి. మొదటి వార్డు నుంచి కాంగ్రెస్ విజయ పరంపర మొదలైంది. 1వ వార్డులో డేరంగుల ప్రసాద్, 2వ వార్డులో దగ్గుమల్ల మౌనిక 341 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే 3వ వార్డులో చిన్నంశెట్టి శ్రీను 313 ఓట్లతో, 4వ వార్డులో కట్ట సింధూజ 192 ఓట్లతో గెలుపొందారు. 5వ వార్డులో కొట్టే నగసునిత 34 ఓట్లతో, 6వ వార్డులో జూపల్లి శశికళ 150 ఓట్లతో కాంగ్రెస్ ఖాతాను బలోపేతం చేశారు.
మధ్యలో బీఆర్ఎస్, బీజేపీ బోనీ
7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొల్లి రవికిరణ్ విజయం సాధించి పార్టీకి తొలి సీటు అందించారు. అయితే తదుపరి వార్డుల్లో మళ్లీ కాంగ్రెస్ దూకుడు కొనసాగింది. 8వ వార్డులో రెహానా, 9వ వార్డులో కారం కనకదుర్గ, 10వ వార్డులో మిండ హరిబాబు, 11వ వార్డులో నార్లపాటి మహేష్ విజయం సాధించారు. 12వ వార్డులో ఆటం రమ్య 165 ఓట్లతో గెలుపొందగా, 13వ వార్డులో జూపల్లి రమేష్ విజయం సాధించారు. 14వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఉదయజ్యోతి 88 ఓట్లతో గెలుపొందగా, 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి గీతశ్రీ 45 ఓట్లతో విజయం సాధించి పార్టీ ఖాతా తెరిచారు.
ఇండిపెండెంట్లకు కూడా అవకాశాలు
మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. 15వ వార్డులో మోర్లా రాజేశ్వరి, 16వ వార్డులో దండబత్తుల ఆదిలక్ష్మి, 18వ వార్డులో తిరుమలశెట్టి వెంకన్న, 20వ వార్డులో షేక్ నూర్జహాన్, 22వ వార్డులో నర్లపాటి దివాకర్ విజయం సాధించారు. 19వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి రవి, 21వ వార్డులో ఇండిపెండెంట్ మౌనిక విజయం సాధించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డులను కైవసం చేసుకుని అశ్వారావుపేట మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించింది. దీంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుండగా, ప్రత్యర్థి పార్టీల్లో విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.


