కల్లూరు కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత
మూడు అంచెల నిఘా…
అనధికార వస్తువులకు అనుమతి లేదు
ఏసీపీ వసుంధర యాదవ్
కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పాటు పోలీసు నిఘా కొనసాగుతోందని, మూడు అంచెల భద్రతా వ్యవస్థ అమలులో ఉందన్నారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, పెన్నులు, ఇంక్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు వంటి అనధికార వస్తువులు తీసుకురావడం పూర్తిగా నిషేధించామని స్పష్టం చేశారు. చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు కలిగిన ఎన్నికల సిబ్బంది, అధికారికంగా అనుమతి పొందిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయడంతో పాటు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కేంద్రాల వద్ద సమావేశాలు, నినాదాలు, గుంపులుగా చేరడం, ఎలాంటి ఆటంకాలు సృష్టించడం అనుమతించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు.


