దాములూరు–కూడలి జాతరకు ప్రత్యేక బస్సులు
కాకతీయ, మధిర : మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న నిర్వహించే దాములూరు–కూడలి జాతరకు భక్తుల సౌకర్యార్థం మధిర నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ ఆర్. రామయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి మధిర బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదే విధంగా జాతర సందర్భంగా స్వామివారి కళ్యాణం ముగిసే వరకు దాములూరు–కూడలి నుంచి మధిరకు తిరుగు ప్రయాణానికి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరాన్ని బట్టి అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధిరతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ విజ్ఞప్తి చేశారు.


