ఖమ్మంలో విజయవంతమైన సార్వత్రిక సమ్మె
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని టి యు సి ఐ డిమాండ్
కాకతీయ, ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె ఖమ్మం నగరంలో విజయవంతమైంది. ఇండస్ట్రియల్ ఏరియాలో టి యు సి ఐ ఆధ్వర్యంలో సిమెంట్, ఐరన్, మార్బుల్ షాపులు, కోల్డ్ స్టోరేజ్, గోదాములు తదితర సంస్థల కార్మికులు పనులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి యు సి ఐ నగర కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని, విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ రంగ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను బానిసలుగా మార్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు.
ఈ సమ్మెలో పి ఓ డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు, టి యు సి ఐ జిల్లా నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


