కూడేలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
కాకతీయ, ఖమ్మం : మహాశివరాత్రి సందర్భంగా జరిగే కూడేలు జాతరకు భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం డిపో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి ఉండగా, ఫిబ్రవరి 14 సాయంత్రం నుంచే ఖమ్మం పాత బస్టాండ్, కాల్వోడ్డు నయాబజార్ స్కూల్ ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
మొత్తం 25 ప్రత్యేక బస్సులను నడుపుతూ దాదాపు 200 ట్రిప్పులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బస్సులు కామాంచికల్ మీదుగా తీర్థాల శివాలయం వరకు భక్తులను సురక్షితంగా చేర్చనున్నట్లు చెప్పారు. భారీ సంఖ్యలో భక్తులు జాతరకు హాజరవుతారని అంచనా వేసిన నేపథ్యంలో, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.20గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలని, ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితమని సూచించారు. జాతరకు వెళ్లే భక్తులందరూ ఆర్టీసీ సేవలను ఉపయోగించి సురక్షితంగా వెళ్లి రావాలని డిపో మేనేజర్ శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు.


