కౌంటింగ్ కేంద్రాలకు మూడంచెల భద్రత
మూడు మున్సిపాలిటీల్లో 163 అమలు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, బాణాసంచా వినియోగం పూర్తిగా నిషేధించామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూంల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి, కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌లతో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో పకడ్బందీగా 163 అమలులో ఉంటుందని వెల్లడించారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు వంటి నిషేధిత వస్తువులను కేంద్రాల్లోకి తీసుకురావద్దని సూచించారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందికే ప్రవేశం ఉంటుందని, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.


