శివరాత్రికి సిద్ధమైన నల్లబెల్లి రాజరాజేశ్వరాలయాలు
అభిషేకాలు, రుద్రహోమం, కళ్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
కాకతీయ, నల్లబెల్లి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు గుండ్లపహాడ్, మేడపల్లి గ్రామాల్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాలు భక్తుల రాకకు సిద్ధమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శివరాత్రి రోజున ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, నిత్య అర్చనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు మహా రుద్ర హోమం, రాత్రి 8.30 గంటలకు పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో బిల్వార్చన, సుగంధ పుష్పార్చన, మహా కంఠ హారతి, పంచామృత తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివరాత్రి జాగరణను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఆలయ కమిటీ చైర్మన్లు, కార్యవర్గ సభ్యులు, అర్చకులు పాల్గొంటున్నారు.


