బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ
కాకతీయ, బోనకల్ : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడల్లో బోనకల్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు బాల్ బ్యాట్మెంటన్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్ 17, అండర్ 19 విభాగాల్లో పోటీ చేసిన గురుకుల విద్యార్థినులు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకువచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. పీఈటీలు కళా సంధ్య, బిందు మరియు ఉపాధ్యాయులు కూడా విద్యార్థినులను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రత్యేకంగా ప్రతిభ కనబరిచిన మధులత, మనీషా, ఆకాంక్ష, రాజేశ్వరి లను అభినందించారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణిస్తూ గురుకుల విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం పాఠశాలకు గర్వకారణమని ఉపాధ్యాయులు తెలిపారు.


