క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు
కాకతీయ, రామకృష్ణాపూర్ : రెండో విడత మున్సిపల్ ఎన్నికలలో భాగంగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను మొత్తం 45 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రెండు పోలింగ్ బూత్‌ల చొప్పున సగటున 800 మంది ఓటర్లను కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ముగిసే సరికి మొత్తం 71.87 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాసరావు ప్రాథమికంగా వెల్లడించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని స్థానిక సింగరేణి ఆర్కేసీఓఏ క్లబ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు భద్రతా నడుమ తరలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ రమేష్, ఎస్సైలు నరేష్, శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఏఈలు ఆశ్రిత్, సునీల్, సంతోష్ సహా సిబ్బంది ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య గెలుపు పోరు ఆసక్తికరంగా మారింది.


