నువ్వు అంత మోగొనివా..!
నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావా?
ఏయ్ సీఐ.. నిన్ను వదిలిపెట్టను
పోలీసులపై సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బూతు పురాణం
కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందంటూ కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం, చివరకు పోలీసులతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీసింది. సమాచారం అందుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి హుటాహుటిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ శివకుమార్ వ్యవహారశైలిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో పోలీసు అధికారులపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. పోలింగ్ కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జగ్గారెడ్డి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. పరిస్థితి అదుపు తప్పి కొద్దిసేపు తోపులాటకు దారి తీసింది. డీఎస్పీ సత్తయ్య గౌడ్ సహా ఇతర పోలీసు సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పోలింగ్ కేంద్రంలో హైడ్రామా
పోలింగ్ కేంద్రం వద్ద జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంబంధిత సీఐ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. “పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అధికార పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారు” అంటూ విమర్శించారు. వెంటనే సంబంధిత సీఐను సస్పెండ్ చేయాలని, లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అలాగే 34వ వార్డులో జరుగుతున్న పోలింగ్‌ను తక్షణమే రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.
చట్టపరమైన చర్యలకు సన్నాహాలు
ఇదిలా ఉండగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిబ్రవరి 10న సదాశివపేటలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలపై జగ్గారెడ్డిపై ఇప్పటికే కేసు నమోదైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తాజాగా పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటి ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులపై దురుసు ప్రవర్తన, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి నివేదిక కోరినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. అదనపు బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది.


