యూరియాను నేరుగా అందించాలి : ఏఐకేఎంఎస్ డిమాండ్
కాకతీయ, కూసుమంచి : రైతులకు యూరియాను యాప్ విధానం ద్వారా కాకుండా నేరుగా అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు యూరియా పంపిణీలో యాప్ విధానం తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువురాని రైతులు, సెల్ఫోన్ లేని రైతులు ఈ విధానంతో యూరియా పొందలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. షాపుల వద్దకు యూరియా కోసం వెళ్లిన రైతులను “ముందుగా యాప్లో బుక్ చేసుకోవాలి” అంటూ వెనక్కి పంపిస్తున్నారని చెప్పారు. ఇదే అవకాశంగా కొందరు డీలర్లు రైతుల పేరుతో యాప్లో బుక్ చేసి బ్లాక్ మార్కెట్లో ఒక కట్ట యూరియాను రూ.500 నుంచి రూ.600 వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. కూసుమంచి మండలానికి రావాల్సిన యూరియా ఇతర మండలాలకు అక్రమ మార్గాల్లో తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే యాప్ విధానాన్ని రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా అందించే పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, రైతుబంధు పథకాన్ని తక్షణమే రైతులు, కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని, ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకుడు కలకొండ సురేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, నాయకులు బత్తుల ఉప్పయ్య, నోముల రంగారావు, నిమ్మల వెంకన్న, కలకొండ కల్పన తదితరులు పాల్గొన్నారు.


