అశ్వాపురంలో 7 కిలోల గంజాయి పట్టివేత
రూ.4.60 లక్షల విలువైన సరుకు స్వాధీనం – ఇద్దరు అరెస్ట్
కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : అశ్వాపురం మండల పరిధిలో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 7 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా, గంజాయి తరలించేందుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్లు జీ. గణేష్, కె. తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్ శ్రీహరిరావు తన సిబ్బందితో కలిసి అశ్వాపురం–మొండికుంట సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
మొండికుంట నుంచి అశ్వాపురం వైపు వెళ్లే మార్గంలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో అనుమానాస్పదంగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని 7 కిలోల గంజాయి, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు.
ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలింపు ప్రయత్నం
అరెస్ట్ అయిన వ్యక్తులు సూర్యాపేట జిల్లాకు చెందిన బడేటి వెంకటేష్ (తండ్రి: కృష్ణ), ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన మోరుబోయిన గోపయ్య (తండ్రి: నాగరాజు)గా గుర్తించారు. వీరు ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి ప్రాంతం నుంచి గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4,60,000 ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు ఎం.ఏ. కరీం, సుధీర్, వెంకట్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ మాదకద్రవ్యాల రవాణాపై నిఘా మరింత పెంచామని, ఇలాంటి చర్యలను కఠినంగా అడ్డుకుంటామని ఖమ్మం ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.


