ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి
నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరిక
కాకతీయ, కొత్తగూడెం : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ కోరారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు కొత్తగూడెం పట్టణంలోని 33 డివిజన్లలో రూ.34 వేల విలువైన 40 లీటర్ల మద్యం, రూ.2.70 లక్షల విలువైన 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై మూడు కేసులు నమోదు చేశామని, 110 కేసుల్లో 258 మందిని బైండోవర్ చేశామని చెప్పారు. 41 పోలింగ్ స్థానాల్లో 110 పోలింగ్ కేంద్రాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, అందులో 65 సున్నితమైన కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు


