చేర్యాల యువ ఫోటోగ్రాఫర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న అల్లం రవికుమార్
కాకతీయ, చేర్యాల : చేర్యాల ప్రాంతానికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ అల్లం రవికుమార్ అరుదైన “వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ ఎక్సలెన్స్” పురస్కారానికి ఎంపిక కావడం స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఫోటోగ్రఫీ రంగంలో వినూత్న సేవలందిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ఈ అవార్డుతో మరింత ప్రతిష్ఠ పొందారు. గత నాలుగు దశాబ్దాలుగా చేర్యాల ప్రాంతంలో ఫోటోగ్రఫీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ అల్లం శ్రీనివాస్ కుమారుడైన రవికుమార్, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నూతన సాంకేతికతకు అనుగుణంగా సృజనాత్మక ఫోటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బీటెక్ చదివి లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని తన అభిరుచికి అనుగుణంగా ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నారు. మారుతున్న డిజిటల్ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా వినూత్న శైలిలో ఫోటోగ్రఫీ సేవలు అందిస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నారు. చేర్యాల ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిన రవికుమార్‌కు ఈ పురస్కారం లభించడం పట్ల స్థానికులు, ఫోటోగ్రఫీ రంగ ప్రముఖులు అభినందనలు తెలిపారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నేత కొమ్మూరి రాకేశ్ రెడ్డి అల్లం రవిని అభినందించి చిన్న వయసులో ఇంతటి గౌరవం దక్కడం చాలా సంతోషమని ఇంకా ఫోటో గ్రాఫర్లో తనదైన శైలిలో ముద్ర వేసుకుని మరింత కనక కనబరచాలని అలానే కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి ఉన్నత శిఖరాలను అవరోదించాలని రాకేష్ రెడ్డి కోరారు.


