ఖమ్మంలో కుళ్లిపోయిన మటన్ కలకలం!
స్థానికుల ఫిర్యాదుతో బయటపడిన గుట్టు
రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు
30 కేజీల చెడిపోయిన మటన్ స్వాధీనం
జైలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు గుర్తింపు
కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో కుళ్లిపోయిన మటన్ అమ్మకాలు జరగడం తీవ్ర కలకలం రేపింది. మూడో పట్టణ ప్రాంతంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న మస్తాన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న మటన్ షాపులో ఈ అక్రమ దందా బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దుకాణంలో డీప్ ఫ్రిజ్‌లో దాచిపెట్టిన సుమారు 30 కేజీల కుళ్లిపోయిన మటన్‌ను అధికారులు గుర్తించారు. ఫ్రిజ్ తలుపు తెరవగానే భరించలేని దుర్వాసన రావడంతో ఆ మాంసం పూర్తిగా పాడైపోయినట్లు స్పష్టమైంది. అయినప్పటికీ ఎవరికి అనుమానం రాకుండా విక్రయాలు సాగిస్తున్నట్టు తేలింది. స్థానికుల కథనం ప్రకారం ఈ షాపు యజమాని గత కొన్ని ఏళ్లుగా ఇదే విధంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అంతేకాక జిల్లా జైలుకు వారానికి ఒకసారి మటన్ సరఫరా చేసే కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. నగరంలోని పలు పెద్ద హోటళ్లకు కూడా ఇక్కడి నుంచే మాంసం సరఫరా అవుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
అధికారుల తనిఖీలతో అసలు విషయం బహిర్గతం
ప్రాంతవాసుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దుకాణాన్ని తనిఖీ చేసింది. తనిఖీల్లో చెడిపోయిన మటన్ నిల్వలను గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వచ్చారన్న విషయం తెలిసి నిర్వాహకుడు ముందుగానే మాంసాన్ని తొలగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న మహిళా జవాన్ అప్రమత్తంగా వ్యవహరించి అతని ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అక్రమ వ్యవహారం పూర్తిగా బయటపడింది.
రోగాల బారిన గొర్రెలు కూడా స్వాధీనం
తనిఖీలు కొనసాగుతున్న సమయంలోనే నిర్వాహకుడికి సంబంధించిన మరో అక్రమం బయటపడింది. రోగాల బారిన పడిన మూడు గొర్రెలను ఆటోలో తీసుకువస్తుండగా అధికారులు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గొర్రెలను కూడా మాంసంగా మార్చి విక్రయించే యత్నం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాసిరకం, కుళ్లిపోయిన మాంసం విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని మండిపడ్డారు. నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానికులు తోళ్ల రాకేష్, బొమ్మ ఉదయ్, దుర్గ తదితరులు కీలకంగా వ్యవహరించి అధికారులకు సమాచారం అందించారు. వారి చొరవతోనే ఈ అక్రమ దందా బయటపడిందని అధికారులు తెలిపారు. నగరంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి అమ్మకాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




