బీఆర్ఎస్ అభ్యర్థి భర్త సస్పెన్షన్‌తో రాజకీయ కలకలం
చేర్యాలలో ఎన్నికల వేళ హైడ్రామా
కానిస్టేబుల్ రమేష్‌పై వేటు వేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు
కక్షపూరిత చర్య అంటూ బీఆర్ ఎస్ అభ్యర్థి నిరసన
కాకతీయ, చేర్యాల : సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి భర్తపై సస్పెన్షన్ వేటు పడడం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి భర్త, కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రమేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గీతాంజలి కుటుంబసభ్యులతో కలిసి చేర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు.
చేర్యాల మున్సిపాలిటీలో రెండో వార్డు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా కమలాపురం గీతాంజలి, కాంగ్రెస్ అభ్యర్థిగా ముస్త్యాల తేజ పోటీలో ఉన్నారు. గీతాంజలి భర్త రమేష్ తన భార్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో పోలీస్ ఉన్నతాధికారులు శనివారం అర్ధరాత్రి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు.
కక్షపూరిత చర్య అంటూ ఆరోపణలు
ఈ ఘటనపై గీతాంజలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తన సేవలను గుర్తించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు బీ-ఫామ్ ఇచ్చారని తెలిపారు. తాను ప్రజల్లో చురుగ్గా ప్రచారం చేస్తుండటాన్ని చూసి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి భయంతో కుట్రపూరితంగా తన భర్తపై చర్యలు తీసుకునేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి తేజ భర్త సంజీవయ్య ఇటీవలే ట్రాన్స్‌కోలో ఎస్ఈగా పదవీ విరమణ చేసి కాంగ్రెస్‌లో చేరారని, అధికార బలాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గీతాంజలి మండిపడ్డారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని డబ్బు ఆశ చూపించి ఒత్తిడి చేసినా తాము తలొగ్గలేదన్నారు. ఎన్నికల సమయంలో తన భర్తను సస్పెండ్ చేయించడం ద్వారా మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యేనని, ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, తన భర్త రమేష్‌పై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గీతాంజలి డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ చర్య జరిగిందా? లేక నిబంధనల ఉల్లంఘన వల్లేనా అన్న అంశంపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



