మున్సిపల్ పోరులో బీజేపీదే విజయం!
రాష్ట్రంలో అనుకూలంగా మారిన రాజకీయ వాతావరణం
కాంగ్రెస్–బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి..
అత్యధిక స్థానాల్లో గెలిచితీరుతాం
కేంద్ర నిధులతో కార్పొరేషన్ల అభివృద్ధి హామీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం నెలకొన్నదని స్పష్టం చేశారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాంచందర్ రావు… ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధికి అవసరమైన అధిక నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని ఆయన గుర్తు చేశారు. ఆ విషయాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకొని బీజేపీ అభ్యర్థులను గెలిపించి కార్పొరేషన్‌కు పంపించాలని కోరారు. ప్రజాసేవే బీజేపీ లక్ష్యమని, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతామని తెలిపారు.

కాంగ్రెస్–బీఆర్ఎస్‌లది నాటక రాజకీయం
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బయటకు శత్రువుల్లా నటిస్తున్నప్పటికీ లోపల మాత్రం పరస్పరం సహకరించుకుంటున్నాయని రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తమ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ రెండు పార్టీలు బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వమే కాపాడిందని ఆయన ఆరోపించారు. అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులను రక్షించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని రాంచందర్ రావు అన్నారు. కీలక కేసులకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, డీఎన్‌ఏ రిపోర్టులు, డిజిటల్ ఆధారాలు ఉన్న చోటే అగ్నిప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. గతంలో సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంతో పోలికలు కనిపిస్తున్నాయని, ఈ రెండు ఘటనలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై అనుమానాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ఫలితాలు రాలేదని రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో ఈ వ్యవహారాన్ని కావాలనే నాన్చుతున్నదని ఆరోపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికే జరిగిందేమోనన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ కేసులో అనేక మంది బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అందువల్ల ఈ అగ్నిప్రమాదంపై స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు తప్పనిసరిగా జరగాల్సిందేనని బీజేపీ స్పష్టంగా డిమాండ్ చేస్తోందన్నారు. నిజాలు బయటపడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు కె.వి.రంగా కిరణ్, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


