మల్లన్న క్షేత్రంలో భక్త జన సంద్రం
మల్లన్న నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి
పట్నం దాటిన భక్తులు.. బండారు మయమైన ఆలయ ప్రాంగణం
కాకతీయ, కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధాన ఘట్టమైన పట్నం దాటే కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు “కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న” నామస్మరణతో ఆలయ పరిసరాలను మారుమోగించారు. ఒగ్గు పూజారులు పంచరంగులతో ప్రత్యేకంగా పెద్ద పట్నాన్ని రచించగా, భక్తులు భక్తి పారవశ్యంలో పట్నాన్ని దాటారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా బండారు పొడితో పసుపుమయంగా మారింది. అనంతరం భక్తులు ప్రత్యేక పటాలు తయారుచేసి పూజలు నిర్వహించారు. కోర మీసాల కొమురెల్లి మల్లన్న కోర్కెలు తీర్చన్న అంటూ అగ్నిగుండాలను దాటుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు. తదుపరి ఆలయ ప్రధాన గోపురం గుండా గొల్ల కేతమ్మ, బలిజ మెడలమ్మలతో కొలువైన మల్లన్నను దర్శించుకుని భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఇతర అర్చకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల తాకిడితో కొమురవెల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.



